కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ ఆ పదవికి రాజీనామా చేశారు. (Trinamool MP Resigned) కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఆదివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి ఈ మేరకు లేఖ రాశారు. చాలా నెలలుగా ఆమెతో స్వయంగా మాట్లాడలేకపోయినందుకు నిరాశ చెందినట్లు తెలిపారు. అవినీతి అధికారులు (లేదా వైద్యులు) టాప్ పోస్టింగ్‌లు పొందడం వంటి కొన్ని విషయాలను తాను అంగీకరించలేనని పేర్కొన్నారు.
కాగా, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీఎంసీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని ప్రజల ఆగ్రహం ప్రతిబింబిస్తోందని జవహర్ సిర్కార్ విమర్శించారు. ప్రభుత్వంపై ఇలాంటి పూర్తి అవిశ్వాసాన్ని తాను ఇప్పటి వరకు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లపై ఘర్షణ రహిత విధానాన్ని చేపట్టాలని కోరారు.
మరోవైపు పార్టీ పంథాను సరిదిద్దుకోకుంటే ‘మతోన్మాద శక్తులు రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటాయని జవహర్ సిర్కార్ హెచ్చరించారు. ‘మూడేళ్లుగా బెంగాల్ సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తడానికి మీరు ఇచ్చిన అవకాశానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కానీ ఎంపీగా కొనసాగడం నాకు ఇష్టం లేదు. కేంద్రం, రాష్ట్రాల్లో అవినీతి, మతతత్వం, నిరంకుశత్వంపై పోరాడటమే నా నిబద్ధత. ఇందులో చర్చలకు తావులేదు’ అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.