న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో మాట్లాడుతుండగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సౌగతా రాయ్ అడ్డుకున్నారు. దీంతో ఆయనపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం లోక్‌సభలో అమిత్ షా ప్రసంగించారు. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్, మాదక ద్రవ్యాల ముప్పు గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ కల్పించుకుని ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దాదా, మీరు మాట్లాడాలనుకుంటే, నేను కూర్చుంటాను. అప్పుడు మీరు మాట్లాడవచ్చు. సీనియర్ ఎంపీగా ఉన్న మీరు ఇలాంటి అంతరాయాలు కలిగించడం మీ హోదా, మీ సీనియారిటీకి తగదు’ అని అన్నారు.
కాగా, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ కూడా వెంటనే ప్రతిస్పందించారు. ‘మీకు కోపం ఎందుకు వస్తుంది?’ అని ఎదురు ప్రశ్నించారు. అయితే తాను కోపగించుకోలేదని, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఆ వెంటనే తన సీటులో కూర్చొన్నారు. ఇంతలో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. టాపిక్ సీరియస్‌నెస్‌ను అర్థం చేసుకోవాలని అన్నారు. ప్రసంగాన్ని కొనసాగించాలని అమిత్ షాను కోరారు. దీంతో పైకి లేచిన ఆయన మాట్లాడటాన్ని కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయాలను పక్కనపెట్టి డ్రగ్స్‌పై పోరాటంలో కేంద్రంతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల బానిసలను బాధితులుగా పరిగణించాలని, వారికి పునరావాసం కల్పించాలని సూచించారు.
A show-stopping moment at the Parliament's ongoing Winter Session. pic.twitter.com/rbyRH6Z4ha
— P C Mohan (@PCMohanMP) December 21, 2022