కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన మరో నేతపై కాల్పులు జరిగాయి. పట్టపగలు అంతా చూస్తుండగానే సాయుధ వ్యక్తులు టీఎంసీ నేతపై కాల్పులు జరిపారు. (Trinamool Leader Shot) తీవ్ర బుల్లెట్ గాయాలైన ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆ నేత పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని నోడఖాలిలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం బైక్‌పై వెళ్తున్న స్థానిక టీఎంసీ నేత కృష్ణపాద మండల్‌పై కొందరు వ్యక్తులు దగ్గర నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
కాగా, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అధికార టీఎంసీ నేతపై కాల్పులకు కారణం రాజకీయాలా? లేక వ్యక్తిగత విభేదాలా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. అయితే ఆ ప్రాంతంలోని అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలు ఈ కాల్పులకు కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు.
మరోవైపు టీఎంసీ నేతలపై కాల్పులు జరుగడం ఈ నెలలో ఇది మూడో సంఘటన. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నోడఖలిలో కాల్పులు జరుగడం స్థానికంగా కలకలం రేపింది.