న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రగులుతున్నది. అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మద్దతిచ్చింది. (Trinamool supports AAP) ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతిచ్చిన టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ఎప్పుడూ కూడా ఆప్‌కు మద్దతుగా ఉన్నారని కొనియాడారు. అరవింద్ కేజ్రీవాల్ మేరకు బుధవారం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు టీఎంసీ మద్దతు ప్రకటించింది. మమతా దీదీకి నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ధన్యవాదాలు దీదీ. మా మంచి, చెడు సమయాల్లో మీరు ఎల్లప్పుడూ మాకు మద్దతు ఇచ్చారు. మమల్ని ఆశీర్వదించారు’ అని పేర్కొన్నారు.
కాగా, ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ బ్లాక్‌లో భాగమైన ఆప్‌కు ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) కూడా మద్దతిచ్చాయి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన ఆప్ ఈసారి ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది.
మరోవైపు 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు 67, 62 స్థానాలతో ఆప్ క్లీన్ స్వీప్ చేసింది. హ్యాట్రిక్ విక్టరీతో మూడోసారి అధికారంలోకి రావాలని ఆ పార్టీ భావిస్తున్నది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.