కోల్‌కతా: అధికార పార్టీకి చెందిన నేత ఒక మహిళతో కలిసి హోటల్లో బస చేశాడు. అయితే సీలింగ్‌కు వేలాడుతున్న ఆయన మృతదేహాన్ని హోటల్ సిబ్బంది గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (TMC Leader Died At Hotel) అక్కడి నుంచి మాయమైన మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన 34 ఏళ్ల అబుల్ నాసర్, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని అమ్దంగా ప్రాంతంలో ప్రభావవంత నేతగా గుర్తింపు పొందాడు. ఆయన ఒక మహిళతో కలిసి మందర్మణి సముద్ర రిసార్ట్‌లోని ఓ హోటల్లో బస చేశాడు.
కాగా, శనివారం ఉదయం హోటల్ రూమ్‌లో సీలింగ్‌కు వేలాడుతున్న అబుల్ నాసర్ మృతదేహాన్ని సిబ్బంది గమనించారు. ఆయనతో పాటు హోటల్లో బస చేసిన మహిళ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ హోటల్‌కు చేరుకున్నారు. నాసర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు హోటల్ నుంచి పారిపోయిన ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాసర్ మృతిపై ప్రశ్నించేందుకు పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలించారు. ఆయనది ఆత్మహత్యా లేక హత్యా అన్నది పోస్ట్‌మార్టం తర్వాత తెలుస్తుందని పోలీస్ అధికారి వెల్లడించారు. అయితే తన భర్తను హత్య చేసినట్లు తృణమూల్ డిప్యూటీ పంచాయితీ చీఫ్ అయిన నాసర్ భార్య ఆరోపించింది.