అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో భాషా వివాదం చెలరేగింది. ఆ రాష్ట్ర అధికార భాషల్లో ఒకటైన కోక్బోరోక్కు రోమన్ లిపిని ఆమోదించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. (Roman Scrip Demand In Tripura) శుక్రవారం అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజున రాజధాని అగర్తలాలో ట్విప్రా స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో భారీగా నిరసన చేపట్టారు. అసెంబ్లీ, హైకోర్టు, విమానాశ్రానికి వెళ్లే ముఖ్య రహదారులను బ్లాక్ చేశారు. దశాబ్దాల నాటి తమ డిమాండ్‌ను నెరవేర్చాలని గిరిజన విద్యార్థుల సంస్థ టీఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.
కాగా, వందలాది మంది టీఎస్ఎఫ్, యూత్ టిప్రా ఫెడరేషన్ (వైటీఎఫ్) కార్యకర్తలు రహదారుల్లోని కీలక కూడళ్ల వద్ద గుమిగూడారు. కోక్బోరోక్కు రోమన్ స్క్రిప్ట్‌ను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ మేరకు ఫ్లకార్డులు ప్రదర్శించారు.
మరోవైపు అధికారిక రికార్డులు, విద్యలో ప్రస్తుతం వినియోగిస్తున్న బెంగాలీ లిపి స్థానంలో రోమన్ లిపిని అమలు చేయాలని గిరిజన విద్యార్థి సంఘం నేత డిమాండ్ చేశారు. స్థానికంగా పెద్దదైన గిరిజన వర్గానికి చెందిన ఈ లిపి ప్రాధాన్యతను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
కాగా, విద్యార్థుల నిరసన వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అసెంబ్లీకి వెళ్లేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నిరసన విరమించాలని పోలీసులు, భద్రతా సిబ్బంది సూచించారు. లేకపోతే చట్టపరంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు. అయితే తమ డిమాండ్ కోసం నిరసనను ఉధృతం చేస్తామని గిరిజన విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి.