యావత్మాల్, డిసెంబరు 12: శివసేన (ఉద్ధవ్ వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌పై రాజద్రోహం కేసు నమోదైంది. శివసేన వార్తాపత్రిక ‘సామ్నా’లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అభ్యంతరకర కథనాన్ని రాసినందుకు యావత్మాల్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ యావత్మాల్ జిల్లా కోఆర్డినేటర్ నితిన్ భుటాడా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. సామ్నా పత్రికకు రౌత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబరు 10న మోదీపై అభ్యంతరకర కథనం ప్రచురితమైందన్న నితిన్ ఫిర్యాదుతో సోమవారం ఉమర్‌ఖేడ్ పోలీస్ స్టేషన్లో రౌత్‌పై రాజద్రోహం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.