న్యూఢిల్లీ: జానపద నృత్యకారిణి, ట్రాన్స్‌జెండర్ మంజమ్మ జోగతి .. రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నది. అయితే ఆ అవార్డు స్వీకరించేందుకు వెళ్లిన మంజమ్మ .. తనదైన రీతిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను దీవించింది. మంగళవారం పద్మ అవార్డుల వేడుక సమయంలో.. రాష్ట్రపతి భవన్లో ఓ విన్నూత ఘటన చోటుచేసుకున్నది. కర్నాటకకు చెందిన ట్రాన్స్‌జెండర్ మంజమ్మకు ఫోక్ డ్యాన్స్ క్యాటగిరీలో పద్మశ్రీ అవార్డు దక్కింది. అయితే ఆ అవార్డును అందుకునేందుకు రాష్ట్రపతి కోవింద్ వద్దకు వెళ్లిన ఆమె ఆయన్ను దీవించింది. తన చీర కొంగుతో కోవింద్‌కు దిష్టి తీసి.. శుభం కలిగేలా దీవనెలు చేసింది. మంజమ్మ తన చీరతో కోవింద్‌కు గుడ్‌లక్ చెప్పిన తీరు అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది. ట్రాన్స్జెండర్లు దీవిస్తే మంచి జరుగుతందన్న ఓ నమ్మకం ఉంది.
#WATCH | Transgender folk dancer of Jogamma heritage and the first transwoman President of Karnataka Janapada Academy, Matha B Manjamma Jogati receives the Padma Shri award from President Ram Nath Kovind. pic.twitter.com/SNzp9aFkre
— ANI (@ANI) November 9, 2021
బల్లారి జిల్లాలో మంజూనాథ్ శెట్టిగా మంజమ్మ జన్మించింది. ఆమె పదవ తరగతి వరకు చదువుకున్నది. 15 ఏళ్ల వయసులో తనలో స్త్రీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది. ఆ సమయంలో ఆమె పేరెంట్స్ ఆమెను హోస్పేట్లోని ఆలయానికి తీసుకువెళ్లారు. అక్కడ జోగప్ప పూజలు చేశారు. దేవతతో ఆమెకు పెళ్లి చేశారు. అప్పటి నుంచి మంజూనాథ్ శెట్టి కాస్త మంజమ్మ జోగతిగా మారింది. అయితే ఆ తర్వాత ఆమె తన సొంత ఇంటికి వెళ్లలేదు. మొదట్లో ఆమె చీర కట్టుకుని వీధుల్లో భిక్షాటన చేసేది. లైంగిక వేధింపులకు గురైంది. చివరకు ఓ నృత్యకారుడు ఆమెకు డ్యాన్స్ నేర్పాడు. దాంతో ఆమెకు కొత్త జీవితం దొరికింది. జోగప్ప జానపద నృత్యం నేర్చుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఆమె ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. కల్లవ జోగతి మరణం తర్వాత ఆ కళాబృందానికి మంజమ్మ నాయకత్వం వహించింది.
కర్నాటక జానపది అకాడమీకి అధ్యక్షురాలిగా నియమితులైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా మంజమ్మ నిలిచారు. కర్నాటక ప్రభుత్వం తరపున జానపద అకాడమీ తన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మంజమ్మ పద్మశ్రీ అవార్దు అందుకోవడం సంతోషాన్ని ఇస్తోందని ప్రముఖ ట్రాన్స్‌జెండర్ కార్యకర్త అక్కాయి పద్మశాలి తెలిపారు.