చండీగఢ్: ఒక రైతు పొలంలోని ట్రాన్స్ఫార్మర్ను చోరీ చేసేందుకు దొంగలు ప్రయత్నించారు. అయితే వారి కారు బురద నేలలో చిక్కుకుపోయింది. దానిని లాగేందుకు వారు తీసుకొచ్చిన మరో వాహనం కూడా అక్కడ ఇరుక్కుపోయింది. (Transformer Theft) అనుమానించిన గ్రామస్తులు ఆ వ్యక్తులను పట్టుకుని నిలదీయగా ట్రాన్స్ఫార్మర్ చోరీ యత్నం బయటపడింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పొరుగు గ్రామాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు తఖ్తుపురా గ్రామానికి చెందిన రైతు హర్జిందర్ సింగ్ పొలంలోని ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఆగస్ట్ 22న రాత్రి వేళ కారులో అక్కడకు చేరుకున్నారు.
కాగా, పొలంలోని బురద నేలలో ఆ కారు టైర్లు కూరుకుపోయాయి. దీంతో అది అక్కడి నుంచి కదలలేదు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్ చోరీ చేయాలన్న వారి ప్లాన్ బెడిసికొట్టింది. కారును అక్కడే వదిలేసి వారు వెళ్లిపోయారు. మరునాడు ఆ కారును పొలం నుంచి బయటకు లాగేందుకు రికవరీ వాహనంతో ఆ పొలానికి చేరుకున్నారు. అయితే ఆ వాహనం కూడా ఆ బురదలో చిక్కుకున్నది. దీంతో రెండు వాహనాలు ఆ రైతు పొలంలో ఇరుక్కుపోయాయి.
మరోవైపు ఇది చూసిన గ్రామస్తులకు వారిపై అనుమానం కలిగింది. అయితే ఆ ముగ్గురు పలు కారణాలు చెప్పారు. గ్రామస్తులు గట్టిగా నిలదీయంలో ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కుట్ర బయటపడింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని గ్రామస్తులు పట్టుకోగా మిగతా ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. బర్నాలా జిల్లాలోని అల్కడా గ్రామానికి చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులకు అప్పగించారు. మిగతా ఇద్దరు నిందితులను మెగా జిల్లాలోని ఖోటే గ్రామానికి చెందిన జస్దీప్ సింగ్, బఠిండా జిల్లాలోని గోనియానాకు చెందిన వాకీల్ సింగ్‌గా గుర్తించారు.
అయితే రైతు హర్జిందర్ సింగ్ ఫిర్యాదుతో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో జరిగిన ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ పరికరాల దొంగతనాల్లో ఈ నిందితులకు ప్రమేయం ఉన్నదా? అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.