Indian Railway | దేశంలో వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో రైలు ప్రమాదాలకు కుట్ర పన్నుతున్న ఘటనలు గత కొన్ని రోజులుగా పెరిగాయి. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైలు (Train) పట్టాలపై సిలిండర్ పెట్టి రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు యత్నించారు. ఈ ఘటన మరవక ముందే అలాంటి ఘటనే ఇవాళ మరొకటి చోటు చేసుకుంది. రాజస్థాన్ (Rajasthan)లోని అజ్మీర్ (Ajmer)లో రైలు ప్రమాదానికి దుండగులు భారీ కుట్ర పన్నినట్లు తెలిసింది.
పూలేరా – అహ్మదాబాద్ రూట్లో రైలు ట్రాక్‌పై దుండగులు సుమారు 70 కేజీల బరువైన సిమెంట్ దిమ్మెను (cement block) ఉంచారు. రైలు దాన్ని ఢీ కొట్టి ముందుకు దూసుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ క్రమంలో వరుస రైలు ప్రమాదాలపై భారతీయ రైల్వే (Indian Railway) తాజాగా స్పందించింది. గత నెల ఆగస్టు నుంచి ఈ నెల 8వ తేదీ వరకూ 18 ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో అజ్మీర్‌లో ఆదివారం ఒక్కరోజే రెండు ఘటనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది.
రైళ్లను పట్టాలు తప్పించేందుకే ఈ కుట్రలు జరిగాయని పేర్కొంది. ఈ 18 ఘటనల్లో 15 ప్రమాదాలు ఆగస్టులో జరగ్గా.. మరో మూడు ఈ నెల (సెప్టెంబర్‌లో) జరిగినట్లు వివరించింది. రైలు ట్రాక్‌లపై వివిధ రకాల వస్తువులను అధికారులు గుర్తించినట్లు తెలిపింది. వీటిలో ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ట్రాక్టర్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోనే వెలుగు చూసినట్లు తెలిపింది. ఆ తర్వాత పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రమాదాలు జరిగినట్లు వివరించింది. ఇక జూన్ 2023 నుంచి ఇప్పటి వరకూ ఈ తరహా ఘటనలు 24 జరిగినట్లు తెలిపింది.
7 నెలల్లో 19 ఘటనలు..
ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకూ 7 నెలల కాలంలో దేశంలో ఏకంగా 19 రైలు ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక్క జూలైలోనే నాలుగు రైళ్లు పట్టాలు తప్పాయి. వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నప్పటికీ కేంద్రంలోని మోదీ సర్కారు నిర్లక్ష్య వైఖరిని వీడటం లేదు. ఏటా లక్షల కోట్ల ఆదా యం సమకూరుతున్నా ట్రాక్‌ల నిర్వహణకు నిధులు ఏటికేడు తగ్గిస్తుండటంతో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది.
Also Read..
iPhone 16 Series | ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు వచ్చేశాయ్.. ధర, ఇతర వివరాలు మీకోసం..
Rahul Gandhi | ప్రధాని మోదీపై నాకు ఎలాంటి ద్వేషం లేదు : రాహుల్ గాంధీ
Apple | ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్.. సందడి చేసిన అదితి – సిద్ధార్థ్ జంట