Maharashtra | జల్గావ్, జనవరి 22: మహారాష్ట్రలోని జల్గావ్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక రైలులో అగ్నిప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించిన ప్రయాణికులను మరో రైలు ఢీకొట్టింది. సెంట్రల్ రైల్వే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నో నుంచి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీల్లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. నిప్పు రవ్వలు పుట్టి కోచ్‌లలో పొగ వ్యాపించింది. దీంతో మహేజీ – పర్ధాడే స్టేషన్ల మధ్య పచోరా సమీపంలో ప్రయాణికులు చెయిన్ లాగి రైలును ఆపారు.
మంటలు వ్యాపిస్తాయనే భయంతో రైలు నుంచి పక్క ట్రాక్‌పైకి దూకారు. ఇంతలో అదే ట్రాక్ పైన బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొచ్చింది. ట్రాక్‌పైన ఉన్న ప్రయాణికులను ఈ రైలు ఢీకొట్టడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికక్కడే 12 మంది మృత్యువాత పడ్డారు. ఛిద్రమైన మృతదేహాలు, తెగిపడిన అవయవాలతో ఘటనాస్థలి భీతావహంగా మారింది.
ప్రమాదంలో 12 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిని పచోరాలోని ఓ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నామని, వీరికి ప్రాణాపాయం తప్పిందని మహారాష్ట్ర మంత్రి గిరిశ్ మహజన్ తెలిపారు. కాగా, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తమకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో నిప్పు రవ్వలు కనిపించాయని, పొగ వ్యాపించిందని ఓ రైల్వే అధికారి తెలిపారు. హాట్ ఆక్సిల్ లేదా బ్రేక్ బైండింగ్ వల్ల ఇలా జరగొచ్చని తెలిపారు.