చెన్నై, డిసెంబర్ 22: టెలివిజన్ ప్రసారాల కంటెంట్‌ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సోమవారం టెలివిజన్ ప్రసార సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గంటకు 12 నిమిషాలకు మించి వ్యాపార ప్రకటనలను ప్రసారం చేయరాదన్న నిబంధనకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని ట్రాయ్ ఆదేశించింది. ఈ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ పరిమితి నిబంధనను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నిబంధన ఇప్పటికీ అమల్లో ఉందని, దీన్ని ప్రసార సంస్థలు పాటించక తప్పదని ట్రాయ్ అధికారి ఒకరు తెలిపారు.
టీవీ ప్రసార సంస్థలపై కఠిన చర్యలు వద్దని మాత్రమే ఢిల్లీ హైకోర్టు ఆదేశించి స్టే ఇచ్చిందే తప్ప గంటకు 12 నిమిషాల వ్యాపార ప్రకటనల పరిమితిపై ఎటువంటి స్టే ఇవ్వలేదని ఆ అధికారి చెప్పారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం కూడా గంటకు 10 నిమిషాల వాణిజ్య ప్రకటనలు, మరో 2 నిమిషాలు సొంత చానెల్ ప్రచారానికి సంస్థలు సమయం కేటాయించాల్సి ఉంటుంది.
ట్రాయ్ కొత్త నిబంధనలు టెలివిజన్ ప్రసార మీడియాకు చెందిన ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. చందాలు, వాణిజ్య ప్రకటనల ఆదాయం పైనే కంపెనీలు మనుగడ సాగిస్తున్నాయి. ఇలాంటి సమయలో వాణిజ్య ప్రకటనల సమయాన్ని తగ్గించడం వల్ల ఆదాయం మరింత పడిపోతుందని సీనియర్ బ్రాడ్‌కాస్టింగ్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.