Ajith Pawar Death | మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి విమానంలో వెళ్తుండగా ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో బారామతి విమానాశ్రయం రన్‌వే సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి విమానం రన్‌వే పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో కూలిపోయి వెంటనే మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం
మహారాష్ట్ర రాజకీయాల్లో ‘దాదా’గా పిలవబడే అజిత్ పవార్ ప్రస్థానం అత్యంత ముఖ్యమైనది. తన మామ, సీనియర్ నేత శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1991లో తొలిసారిగా బారామతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించిన ఆయన, మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి అరుదైన గుర్తింపు పొందారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రిగా కూడా సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయనకు పరిపాలనపై తిరుగులేని పట్టున్న నేతగా పేరుంది. 2023లో ఎన్సీపీ నుంచి విడిపోయి ఏక్నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరిన ఆయన, తన వర్గాన్ని అసలైన ఎన్సీపీ(అజిత్ పవర్ వర్గం)గా నిరూపించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే పరిపాలనలో కచ్చితత్వం, అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉన్న నేతగా ముద్ర వేసిన ఆయన మృతి మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది. ఈ విషాద వార్తతో మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.