తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ పద్మనాభ స్వామి ఆలయంలో (Padmanabha Swamy temple) చోరీ జరిగింది. ఆలయంలోని మందిరంలో పూజకు వినియోగించే కంచు పాత్రను దొంగిలించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. హర్యానాలో ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రహస్య ఖజానా, అమూల్యమైన సంపద ఉన్న కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రసిద్ధ పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. పురాతన మందిరంలో సాంప్రదాయ పూజలు, ఆచారాల కోసం వినియోగించే ‘ఉరులి’ గా పేర్కొనే కంచు పాత్ర అక్టోబర్ 17న మాయమైంది. దీంతో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. కంచు పాత్రను దొంగించిన వ్యక్తులు హర్యానాలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి స్థానికుల పోలీసుల సహాయంతో వారిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వైద్యుడు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత వారం పద్మనాభ స్వామి ఆలయాన్ని వారు సందర్శించినట్లు చెప్పారు. నిందితులను కేరళకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు అత్యంత భద్రత, సీసీటీవీ కెమెరాల నిఘా, రాత్రింబవళ్లు సిబ్బంది కాపలా ఉండే పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ జరుగడం ఆలయ అధికారులు, పోలీసులకు షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలిసి భక్తులు కూడా నోరెళ్లబెట్టారు.