హర్దోయ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో ఘోరం జరిగింది. ఇరవై మందికిపైగా రైతులతో వెళ్తున్న ట్రాక్టర్ చక్రం ఊడిపోవడంతో అదుపుతప్పి నదిలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే 13 మంది రైతులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మరో పది మందికిపైగా రైతులు గల్లంతయ్యారు. పాలీ ఏరియాలో ఘర్రా నదిపైగల బ్రిడ్జి మీద ఈ ఘటన చోటుచేసుకుంది.
చక్రం ఊడిపోగానే ట్రాక్టర్ అదుపుతప్పి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొట్టి నదిలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్తులతో కలిసి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. సమీపంలోని పట్టణంలో దోసకాయలు అమ్ముకుని తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని ప్రమాదం నుంచి బయటపడిన వాళ్లు తెలిపారు.
ట్రాక్టర్ నదిలో పడిపోయిన విషయం తెలిసి గల్లంతైన వారి కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి అరుపులు, రోదనలతో ఘటనా ప్రాంతంలో పరిస్థితి బీతావహంగా మారింది. గల్లంతైన వారి కోసం అధికారులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.