పనాజీ: గోవాకు (Goa) వస్తున్న రష్యాన్ పర్యాటకుల (Russian tourists) సంఖ్య క్రమంగా తగ్గుతున్నదని ఆ రాష్ట్ర టూరిజం మినిస్టర్ రోహన్ ఖౌంటే ( Tourism Minister Rohan Khaunte) అన్నారు. రష్యన్ ధనవంతులు గోవాకు బదులుగా దుబాయ్‌లోని (Dubai) పర్యటక ప్రాంతాలను తమ గమ్యస్థానంగా మలచుకుంటున్నారని చెప్పారు. ఈ మార్పు వెనకున్న కారణాలను ప్రభుత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అవుట్‌బౌండ్ టూరిజం పెరుగుతున్న అమెరికా, యూఏఈ, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల్లో మార్కెట్లను అధ్యయనం చేయాలన్నారు.
దుబాయ్ ఎప్పటికప్పుడు సరికొత్త పర్యాటక సేవలు, ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొస్తున్నదని, వాటిని గోవా ప్రభుత్వం కూడా అనుసరించాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు సూచించారు. మోపాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం వల్ల రాష్ట్రానికి పర్యాటకుల రాకపోకలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, ఉపాధి కల్పనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.