ముంబై: ఎలాంటి దురుద్దేశం లేకుండా చిన్నపిల్లల బుగ్గలు తాకడాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘దురుద్దేశం లేకుండా ముద్దు చేస్తూ చిన్నారుల చెంపలు తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కాదు. పోక్సో చట్టం సెక్షన్ 7లో ఇది ఉంది. నిందితుడు తప్పుడు ఉద్దేశంతో చిన్నారి బుగ్గ గిల్లినట్లు ప్రైమరీ రిపోర్టులో లేదు’ అని కోర్టు పేర్కొన్నది. అనంతరం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
2020 జూలైలో చిన్నారి బుగ్గగిల్లిన కేసులో ఓ 46 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు 13 నెలలుగా జైల్లో ఉన్నాడు. తమ ఎనిమిదేండ్ల కుమార్తె అతని షాప్‌కు వెళ్లినప్పుడు అతను ఆ చిన్నారి బుగ్గగిల్లినట్లు.. ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. ఇటీవల నిందితుడు ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు అతడి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దాంతో నిందితుడి తరుఫు న్యాయవాది తన క్లయింటుపై తప్పుడు కేసు పెట్టారంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.