న్యూఢిల్లీ: ఒక మహిళ తన ప్రియుడి కుమారుడ్ని హత్య చేసింది. ఆ తర్వాత అతడికి ఫోన్ చేసింది. అతడికి అత్యంత విలువైన వస్తువును తాను తీసుకెళ్లానని చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో 11 ఏండ్ల బాలుడ్ని చంపి మృతదేహాన్ని బెడ్ బాక్స్‌లో ఉంచిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితురాలైన 24 ఏండ్ల పూజా కుమారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ దర్యాప్తు వివరాల ప్రకారం, హత్యకు గురైన బాలుడు దివ్యాంశ్ తండ్రి జితేంద్ర, పూజా మధ్య వివాహేతర సంబంధం ఉంది. 2019 అక్టోబర్ 17న వారిద్దరూ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే భార్య నుంచి విడాకులు పొందనందున తమ పెళ్లిని రిజిస్టర్ చేయలేదు. మూడేండ్లపాటు ఒక అద్దె ఇంట్లో కలిసి జీవించారు.
కాగా, భార్య నుంచి విడాకులు పొందకపోవడంపై జితేంద్ర, పూజా మధ్య తరచుగా గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్లో అతడు పూజాను వదిలి భార్య, కుమారుడితో కలిసి ఉండసాగాడు. దీనిపై ఆమె ఆగ్రహం చెందింది. కుమారుడి పట్ల ప్రేమతోనే జితేంద్ర తన భార్య చెంతకు చేరాడని అనుమానించింది. ఆ బాలుడి అడ్డు తొలగిపోతే అతడు తన వద్దకు వస్తాడని భావించింది. దీని కోసం పూజా ప్లాన్ వేసింది. తెలిసిన వ్యక్తి ద్వారా జితేంద్ర ఇంటి అడ్రస్ పొందింది. ఈ నెల 10న ఆ ఇంటికి వెళ్లింది. డోర్ తెరిచి ఉండగా లోపలకు వెళ్లింది. బెడ్‌పై నిద్రిస్తున్న జితేంద్ర కుమారుడు దివ్యాంశ్‌ను గొంతునులిమి చంపింది. ఆ తర్వాత బెడ్ బాక్స్‌లోని బట్టలను బయటకు తీసి మృతదేహాన్ని అందులో ఉంచింది. అనంతరం డోర్ లాక్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Pujakumari
మరోవైపు దివ్యాంశ్ డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లకపోవడంతో అతడి తల్లికి టీచర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఆమె, తన కుమారుడి కోసం చుట్టుపక్కల వెతికింది. కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. ఇంతలో జితేంద్రకు పూజా నుంచి ఫోన్ వచ్చింది. అతడికి అత్యంత విలువైన వస్తువును తాను తీసుకెళ్లానని చెప్పింది. దీంతో అనుమానించిన భార్యాభర్తలు ఇంట్లో అంతా వెతికారు. బెడ్‌పై పరుపు చిందరవందరగా ఉండటంతో బెడ్ బాక్స్ తెరిచి చూశారు. కుమారుడు దివ్యాంశ్ అచేతనంగా పడి ఉండటం చూసి షాకయ్యారు. ఆసుపత్రికి తరలించగా ఆ బాలుడు అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, బాలుడి హత్యపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తలిద్దరూ పూజాపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆమె కోసం వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. ఆ ప్రాంతంలోనే ఉంటున్న పూజా తమ కళ్లగప్పి తిరుగుతున్నదని పోలీసులు తెలుసుకున్నారు. బాలుడి హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత మంళవారం ఆమెను అరెస్ట్ చేశారు.