లక్నో: టమాటాలు రవాణా చేస్తున్న లారీ బోల్తాపడింది. (Tomato Truck Flips) దీంతో అందులోని టమాటా పెట్టెలు, టమాటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం రేటు పెరిగిన టమాటాలను ఎవరూ ఎత్తుకెళ్లకుండా రాత్రంతా అక్కడ కాపలా కాశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి 18 టన్నుల టమాటాలు రవాణా చేస్తున్న లారీ, మంగళవారం రాత్రి పది గంటల సమయంలో కాన్పూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఆవును గుర్తించిన లారీ డ్రైవర్ దానిని తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో లారీ అదుపుతప్పి ఒక పక్కకు బోల్తాపడింది. లారీ క్లీనర్ స్వల్పంగా గాయపడ్డాడు. స్కూటీపై వెళ్తున్న మహిళ ఆ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
కాగా, లారీ బోల్తాపడటంతో అందులో రవాణా చేస్తున్న టమాటా బాక్స్‌లు రోడ్డుపై పడ్డాయి. దీంతో టమాటాలు చెల్లచెదురయ్యాయి. టమాటా లారీ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను హాస్పిటల్‌కు తరలించారు.
మరోవైపు ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో టమాటా ధర కిలో వందకు చేరింది. ఈ నేపథ్యంలో రోడ్డుపై పడిన టమాటాలను ఎవరూ ఎత్తుకెళ్లకుండా పోలీసులు రాత్రంతా అక్కడ కాపలా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.