Toll Charge | న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా మీ బడ్జెట్ పెంచుకోండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్ చార్జీలు సగటున 4 నుంచి 5 శాతం పెరిగాయి. సవరించిన టోల్ చార్జీలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చాయి. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 855 టోల్ ప్లాజాల్లో 675 ప్రభుత్వ నిధులతో నడుస్తుండగా, 180 ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పెంచిన టోల్ చార్జీలు పలు ప్రధాన రూట్లపై ప్రభావం చూపనున్నాయి. ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వే, ఈస్టర్న్ పెరీఫెరల్ ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి తదితర రూట్లలో ప్రయాణించే వారిపై ఎక్కువ ప్రభావం పడనుంది. ఈ మార్గాల్లో నిత్యం ప్రయాణించే వారు, పర్యాటకులపై చార్జీల భారం పడుతుంది. తద్వారా రవాణా చార్జీలు కూడా త్వరలో పెరగనున్నాయి.