కోల్కతా: ఈద్ ఉల్ ఫితర్ సంబరాల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) పాల్గొన్నారు. ఇవాళ ఆమె కోల్కతాలోని మసీదుకు వెళ్లారు. అక్కడ ముస్లింలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలను ఆమె విమర్శించారు. వామపక్ష, కాషాయ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. మోతాబరిలో ఇటీవల జరిగిన హింసను ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ, మైనార్టీ వర్గాల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యం పాటిస్తున్నామని, అన్ని మతస్థుల కోసం ప్రాణా త్యాగాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. మైనార్టీలను రక్షించడం మెజార్టీల డ్యూటీ అని, ఇక మైనార్టీలు మెజార్టీలతో కలిసి ఉండాలన్నారు. అల్లర్లు జరగకుండా చూసుకుంటామని, తమ పార్టీది ఒకటే గళం అని, హింసను ఆపాలన్నారు.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) కలిసి పనిచేస్తున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. తాము సెక్యులర్ అని, ప్రస్తుతం నవరాత్రి కూడా జరుగుతోందని, వారికి కూడా విషెస్ చెబుతున్నానని, కానీ ఇక్కడ అల్లర్లు సృష్టించేవారిపై కన్నువేశామని, సాధారణ పౌరులు అల్లర్లు సృష్టించరని, కానీ రాజకీయ పార్టీలు హడావుడి చేస్తున్నాయని, నేటి రోజుల్లో వామపక్షం, కాషాయం ఒక్కటైనట్లు దీదీ ఆరోపించారు. ఇది సిగ్గుచేటు ఘటన అని ఆమె పేర్కొన్నారు.
మార్చి 27వ తేదీన మాల్దా జిల్లాలోని మోతబరి ఏరియాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ గొడవకు కారణమైన 61 మందిని అరెస్టు చేశారు. అక్కడ ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. ప్రస్తుతం మోతబరిలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఏడీజీ జావెద్ షామిమ్ తెలిపారు. ఆ హింసను వ్యతిరేకిస్తూ శుక్రవారం బీజేపీ అక్కడ ఆందోళన చేపట్టింది.