నాభి సల్లంగుంటే.. నవాబుతోనైనా మాట్లాడొచ్చంట. కాలే కడుపులు పడే కనాకష్టం గురించి తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన పనే లేదు. తెలంగాణకు ఆకలి కష్టం తెలుసు.. అన్నం విలువ తెలుసు.. ఇంకా చెప్పాల్నంటే తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా వేరేటోళ్లెవ్వరికి తెల్వదు. ఇంతెందుకు నల్లగొండ రైస్ దేశంలోనే ఎంత ఫేమస్! సాగర్ కాల్వ కింద పండిన ధాన్యం ఎక్కడెక్కడికో ఎగుమతి అయ్యేది కాదా! అదే జిల్లాలో ఫ్లోరోసిస్‌తో బాధపడ్డ మునుగోడులో ఎంత దుర్భిక్షం ఉండె..!
ఆకలి కష్టం తెలిసినోడు.. అన్నంగిన్నె బరువు మోసినోడు పాలకుడైతే.. ఆ కష్టం తీర్చడానికి కష్టపడతడు. తెలంగాణలో ఇవాళ జరిగింది ఇదే. ఎనిమిదేండ్ల క్రితం స్వరాష్ట్రం సాధించి.. స్వపరిపాలన ప్రారంభించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదట కష్టపడిందే.. అన్నం కరువు తీర్చడం కోసం.. ఆకలి బాధ పోగొట్టడం కోసం.. అందుకోసం అహరహం తపించిండు. ఫలితం ఇప్పుడు దేశానికే తెలంగాణ రైతు అన్నం పెడుతున్నడు.
ఇదే ఎనిమిదేండ్ల క్రితం.. ఆకలి పేగుల కేకలు తెలియని గుజరాతీ బేహారీ నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించారు. ప్రపంచ ఆహార సూచీలో భారత్ 55వ ర్యాంకులో ఉండేది. ఆ ర్యాంకునే మెరుగుపరచాలని ఆందోళన చెందుతున్న సమయమది. గుజరాత్‌ను ఉద్ధరించిన దేవుడే దిగివచ్చి దేశాన్ని పాలిస్తున్నాడని.. అంతా జేజేలు పలికారు. ఏడాది తిరిగే సరికి 55వ ర్యాంకు కాస్తా 80 అయింది. ఎనిమిదేండ్లయ్యేసరికి 107 వ ర్యాంకుకు దిగజారింది. చివరకు రువాండా, నైజీరియా కంటే ఘోరంగా భారత్ పరిస్థితి మారింది.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచో ట.. హంస తూలికలు ఒకచోట.. అలసిన దేహాలొకచోట అని ప్రజాకవి కాళోజీ అన్నాడు. ఇవాళ దేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం పరిపాలన తీరు ఇట్లానే ఉన్నది.
‘ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) అనుమతిస్తే, ప్రపంచానికి ఆహార నిల్వలను అందించేందుకు భారత్ సిద్ధం’.. గత ఏప్రిల్‌లో గుజరాత్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆర్భాటంగా చేసిన ప్రకటన ఇది. ప్రధాని అలా చెప్పారో లేదో.. ప్రపంచానికి భారత్ అన్నపూర్ణగా మారిపోయిందంటూ కమలశ్రేణులు గప్పాలు కొట్టాయి.
అయితే, భారత్‌లో ఆహార సంక్షోభం, పోషకాహారలోపం, శిశు మరణాల రేటు ప్రమాదకరస్థాయికి చేరిందంటూ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ దారుణమైన స్థితికి పడిపోయింది. ఎంతలా అంటే.. కటిక పేద దేశాలుగా పరిగణించే సూడాన్, రువాండా, నైజీరియా, ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు యుద్ధంతో కకావికలమై, తినడానికి గింజలు లేక అల్లాడుతున్న ఉక్రెయిన్ కంటే కూడా హీనమైన ర్యాంకును నమోదు చేసింది. మోదీ 8 ఏండ్ల పాలనలో ఆకలిసూచీలో భారత్.. ఏకంగా 52 స్థానాలను కోల్పోయింది.
దారుణమైన పరిస్థితి
వివిధ దేశాల్లో ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను సూచించే ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్ఐ)లో భారత్ స్థానం మరింతగా దిగజారింది. 2022 సంవత్సరానికి గానూ మొత్తం 121 దేశాలను పరిగణలోకి తీసుకొంటే 29.1 హంగర్ స్కోరుతో భారత్ 107వ స్థానంలో నిలిచింది. గత కొంతకాలంగా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న పొరుగు దేశం శ్రీలంక, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పేద దేశాలుగా పిలిచే సూడాన్, రువాండా, నైజీరియా, ఇథియోపియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు యుద్ధంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ (36)తో పోలిస్తే భారత్ దారుణమైన ర్యాంకుకు పడిపోవడం గమనార్హం. ఈ మేరకు జీహెచ్ఐ వార్షిక నివేదికను కన్సర్న్ వరల్డ్‌వైడ్, వెల్త్ హంగర్ హిల్ఫ్ సంస్థలు శనివారం సంయుక్తంగా ప్రచురించాయి. భారత్‌లో ఆకలి స్థాయి చాలా తీవ్రంగా ఉన్నదని హెచ్చరించాయి. సూచీలో చైనా, కువైట్, టర్కీ సహా 17 దేశాలు 5 కంటే తక్కువ స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచాయి. ఎంత దారుణమంటే.. దక్షిణాసియాలోని అన్ని దేశాలకంటే కూడా దిగువ స్థానానికి భారత్ చేరుకొన్నది.
మోదీ నిర్వాకం ఇది
పైకి ఉత్తుత్తి మాటలు చెప్పాలంటే మోదీ ఆయన వందిమాగధ జనం ఎంత పెప్పమన్నా చెప్తారు. కానీ.. మోదీ ఆయన మంత్రిగణానికి ఎలాంటి దూరదృష్టి కానీ, దార్శనికత కానీ సున్నాశాతం కూడా లేదు. ముఖ్యంగా ఆహార భద్రత విషయంలో ఎంతమాత్రం ప్రణాళిక లేదు. దేశంలో ఒకవైపు ఆకలి కేకలు వినిపిస్తుంటాయి. మరోవైపు ఏ రాష్ట్రంలోనైనా రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆహార భద్రత హక్కును పణంగా పెడతారు.
పండిన ధాన్యాన్ని కొనరు. ఇదేమయ్యా అంటే.. ఓహ్ మాదగ్గర నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలున్నాయని చెప్తారు. ధాన్యం బాగా పండుతున్నప్పుడు నిల్వల సామర్థ్యాన్ని పెంచవచ్చు కదా అంటీ అదీ చేయరు. ఉన్న నిల్వలను పేదలకు పంచాలి కదా.. అంటే అదీ చేయరు. ధాన్యం నిల్వల నిర్వహణకు ఒక విధానమంటూ ఉండదు. బోలెడు నిల్వలు ఉన్నయని చెప్పి నాలుగైదు నెలలైనా కాలేదు. ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వలు నిండుకున్నయి. లబోదిబోమంటూ.. గోధుమలు, బియ్యం, నూకలు.. ఇలా అన్నింటి దిగుమతులపైనా నిషేధం విధించారు.
ఓ పక్క పండించడానికి రైతు సిద్ధంగా ఉన్నప్పటికీ అతనికి మోదీ సర్కారు నుంచి మద్దతు కొరవడింది సరికదా.. వ్యవసాయాన్నే దారుణంగా దెబ్బతీసే దిశగా మోదీ దుందుడుకు విధానాలు సాగుతున్నాయి. విచిత్రమేమిటంటే.. ఎగుమతులపై నిషేధం విధించటమే ఆలస్యం.. దేశంలోని గోధుమల్లో సింహభాగం ముకేశ్ అబానీ కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇదొక్క నిదర్శనం చాలదా మోదీ దర్శనం కార్పొరేట్ల కోసమేనని చెప్పడానికి..
ఏమిటీ సర్వే? నిర్వహించేదెవరు?
ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆకలి స్థాయులు, పిల్లల్లో పోషకాహారలోపం, శిశుమరణాలు తదితర గణాంకాలు ఆధారంగా చేసుకొని జీహెచ్ఐ వార్షిక నివేదికను ఐర్లాండ్‌కు చెందిన కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్త్ హంగర్ హిల్ఫ్ సంస్థలు ఏటా సంయుక్తంగా వెలువరిస్తాయి. ఎక్కువ స్కోర్ సాధించిన దేశంలో ఆకలి సంక్షోభం తీవ్ర రూపంలో ఉన్నట్టు పరిగణించాలి.
భారత్ ఖండిస్తుందని ముందే తెలిసి..
ఆకలి సూచీలో కిందటేడాది 116 దేశాల్లో భారత్ 101 స్థానంలో నిలిచింది. అయితే అప్పుడు కేంద్రం ఈ నివేదికను తప్పుబట్టింది. ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉన్నదనని నివేదికను ఖండించింది. ఈ క్రమంలో నివేదికను వెలువరించే సమయంలోనే సదరు సంస్థలు ప్రత్యేక వివరణ ఇచ్చాయి.
మోదీ ఎప్పుడు స్పందిస్తారో??
ప్రధాని మోదీ హయాంలో గడిచిన ఎనిమిదేండ్లలో జీహెచ్ఐలో భారత్ స్కోరు దారుణంగా పతనమైంది. చిన్నారుల్లో కనిపిస్త్తున్న పోషకాహార లోపం, ఆకలి, ఎదుగుదల లోపం, కుంగుబాటు వంటివాటిపై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారో చూడాల్సి ఉన్నది. దేశంలో 22.4 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆకలి సూచీలో భారత దాదాపు అట్టడుగు స్థానానికి చేరుకొన్నది.
– పీ చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత
ఇండియా వ్యతిరేక నివేదిక అంటారేమో?
ఎన్పీఏ ప్రభుత్వం మరో అద్భుతమైన లక్ష్యాన్ని సాధించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో భారత్ 101 నుంచి 107వ ర్యాంకుకు దిగజారింది. బీజేపీ జోకర్లు వైఫల్యాన్ని అంగీకరించే బదులు, దీనిని ఇండియా వ్యతిరేక నివేదిక అంటారేమోనని అనుమానంగా ఉన్నది.
-మంత్రి కేటీఆర్