భువనేశ్వర్: నెల వయస్సున శిశువు అనారోగ్యం బారిన పడ్డాడు. ఆ కుటుంబం మూఢనమ్మకంతో వ్యాధి నయం కోసం కాల్చిన కాడతో పసి బాబుకు 40 వాతలు పెట్టారు. (Infant Branded With Hot Iron) దీంతో శిశువు ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫుండెల్పాడ గ్రామంలో నివసించే ఒక మహిళ నెల కిందట బాబుకు జన్మనిచ్చింది. పది రోజుల కిందట ఆ శిశువుకు తీవ్ర జ్వరం వచ్చింది.
కాగా, జ్వరం వల్ల పసి బాలుడు ఏడ్వసాగాడు. దీంతో దుష్టశక్తి అవహించినట్లు ఆ కుటుంబం అనుమానించింది. మూఢనమ్మకంతో వ్యాధి నయం కోసం ఆ శిశువు పొట్ట, తలపై ఎర్రగా కాల్చిన కాడతో 30 నుంచి 40 సార్లు వాతలు పెట్టారు. ఈ చర్య వల్ల ఆ పసి బాలుడి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మరోవైపు శిశువు శరీరంపై సుమారు 40 వాతలు ఉండటం చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. పసి బాబును అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలిసి చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ (సీడీఎంవో) డాక్టర్ సంతోష్ కుమార్ పాండా హాస్పిటల్‌ను సందర్శించారు. శిశువు ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఆ పసి బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
కాగా, వ్యాధి నయం కోసం వాతలు పెట్టడం మారుమూల గ్రామాల్లో జరుగుతోందని డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ మూఢనమ్మకానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. వ్యాధి బారిన పిల్లలను ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించాలని సూచించారు.