న్యూఢిల్లీ, జూన్ 1 : సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సోమవారం నియమితులైన సీనియర్ న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహన 2018లో జస్టిస్ ఇందూ మల్హోత్ర తర్వాత బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు ఉద్యోగోన్నతి పొందిన రెండవ మహిళగా నిలిచారు. 2021 ఆగస్టు 31 నుంచి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బీవీ నాగరత్నతోపాటు సుప్రీంకోర్టులో సేవలందిస్తున్న ఇద్దరు మహిళా న్యాయమూర్తుల్లో మోహన ఒకరు కానున్నారు. 2027లో జస్టిస్ నాగరత్న ఒక నెల కంటే ఎక్కువ కాలంపాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. 59 సంవత్సరాల మోహన 1988లో కోయంబత్తూరు న్యాయ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అప్పటి నుంచి ప్రాక్టీసు చేస్తున్నారు. 2015లో ఆమెను సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టు గుర్తించింది. సాయుధ దళాల్లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, సీనియర్ సిటిజన్ల ఆస్తి హక్కులు, కర్ణాటక హిజాబ్ కేసులు ఆమె వాదించారు.
ఐదుగురు న్యాయమూర్తుల నియామ కానికి కేంద్రం ఆమోదం తెలిపింది. వీరితో కలిపి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరుతుంది. ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీచంద్రశేఖర్, పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవ, జమ్ము కశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు సీజే అరుణ్ పల్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉద్యోగోన్నతి పొందారు.