Jahangir Khan : పశ్చిమబెంగాల్ (West Bengal) రాజకీయాల్లో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) సుదీర్ఘ పాలనకు తెరపడి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజులకే ఒక సంచలన అరెస్ట్ నమోదైంది. బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన మెరుపు దాడిలో తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ (Jahangir Khan) భారత్-నేపాల్ సరిహద్దు (India-Nepal Border) లో అరెస్టయ్యారు. కలకత్తా హైకోర్టు (Culcutta High Court) ఆయనకు ముందస్తు బెయిల్ లేదా రక్షణ పొడిగించేందుకు నిరాకరించడంతో ఎస్టీఎఫ్ ఈ చర్య తీసుకుంది. మే 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనపై ఐదు కొత్త పోలీస్ కేసులు నమోదయ్యాయని కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది.
మమతాబెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి జహంగీర్ ఖాన్ అత్యంత ఆప్తుడు. ఎన్నికల సందర్భంగా డైమండ్ హార్బర్ పరిధిలోని ఫాల్టా నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్ వర్గీయులు భయాందోళనలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో యూపీ కేడర్‌కు చెందిన ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను అక్కడ స్పెషల్ అబ్జర్వర్‌గా నియమించారు. ఫాల్టా ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారికి శర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి కౌంటర్‌గా జహంగీర్ ఖాన్.. టాలీవుడ్ హిట్ సినిమా ‘పుష్ప’ డైలాగులతో రెచ్చిపోయారు. తానే ఇక్కడి పుష్పరాజ్నని, తగ్గేదేలేదని సవాల్ విసిరారు. ఎన్నికల అవకతవకలు, బెదిరింపుల ఆరోపణలతో అప్పటి నుంచే ఆయన పోలీసుల రాడార్‌లో ఉన్నారు.
ఈ క్రమంలో ఇతర నియోజకవర్గాలతోపాటు ఏప్రిల్ 29న ఫాల్టా నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరిగింది. అయితే ఈవీఎంలలో బీజేపీ బటన్‌పై టేప్ అంటించారనే ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం మే 21న రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈలోపే మే 4న రాష్ట్ర ఫలితాలు వెల్లడయ్యాయి. సువేందు అధికారి నేతృత్వంలో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 19న అంటే పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు జహంగీర్ ఖాన్ ఊహించని ట్విస్ట్ ఇస్తూ ఫాల్టా అభివృద్ధి కోసమే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. చివరకు ఫాల్టా స్థానంలో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్‌కు కేవలం 8,000 లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల వేళ రెచ్చిపోయి మాట్లాడిన ఈ తృణమూల్ పుష్ప.. ఫాల్టాలో పోలింగ్ అనంతరం అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. సరిహద్దులు దాటాలని ప్రయత్నించి ఎట్టకేలకు బెంగాల్ పోలీసులకు చిక్కాడు.