కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ తన పదవిని దక్కించుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి నియమితులయ్యారు. రాష్ట్రంలోని అధికార పార్టీలో మమత తర్వాత మళ్లీ నంబర్ 2 స్థానంలో నిలిచారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థ తన ట్విట్టర్ ఖాతాను దుర్వినియోగం చేసినట్లు టీఎంసీ నాయకురాలు చంద్రిమా భట్టాచార్య గత వారం ఆరోపించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని పలువురు నేతలు పట్టుబట్టారు. దీంతో పార్టీలో కుట్ర జరుగుతున్నదని, పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలినట్లు వదంతులు వచ్చాయి. అలాగే అభిషేక్ బెనర్జీ పార్టీని తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.
అప్రమత్తమైన మమతా బెనర్జీ గత శనివారం అత్యవసరంగా పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. సీనియర్ నేతలతో కూడిన జాతీయ వర్కింగ్ కమిటీని తిరిగి నియమించారు. ఈ కమిటీలో అన్ని పదవులను రద్దు చేశారు. అభిషేక్ బెనర్జీ సభ్యుడిగా ఉన్నప్పటికీ, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయనను తొలగించారు. పార్టీ వ్యవహారాలు పూర్తిగా తన నియంత్రణలో ఉండేలా మమతా బెనర్జీ చర్యలు చేపట్టారు.
ఈ పరిణామాల నేపథ్యంలో గత వారం రోజులుగా సీఎం మమతా బెనర్జీ, మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మధ్య కాస్త దూరం పెరిగినట్లు కనిపించింది. అయితే అధినేత్రి మమతా బెనర్జీపై తన విశ్వాసాన్ని అభిషేక్ బెనర్జీ చాటుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె నివాసంలో పునర్నిర్మించిన జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకునే ఈ భేటీలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ బెనర్జీని ప్రకటించారు.