TMC turmoil : పశ్చిమబెంగాల్ (West Bengal) లో అధికార పీఠాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో అంతర్గత సంక్షోభం తీవ్రతరమవుతోంది. పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) కి అత్యంత సన్నిహితుడు, సీనియర్ ఎంపీ (Senior MP) సుదీప్ బంధోపాధ్యాయ (Sudhip Bandhopadhyay) శనివారం ఢిల్లీలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సమావేశంలో తిరుగుబాటు ఎంపీ శతాబ్ది రాయ్ సైతం పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ సభ్యులు తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని కోరుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ ఓటమి పాలవగా.. బీజేపీ నేత సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం పార్టీలో మొదలైన విభేదాలు ఇప్పుడు పార్లమెంటు స్థాయికి చేరాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునేందుకు, బీజేపీలో విలీనం కాకుండానే ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని తిరుగుబాటు వర్గం భావిస్తోంది.
కాకోలీ ఘోష్ దస్తీదార్ వంటి నేతల నేతృత్వంలో తామే అసలైన టీఎంసీ అని ఈ వర్గం వాదిస్తోంది. తిరుగుబాటు ఎంపీ జగదీష్ బసునియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ బృందం ఆదివారం ఢిల్లీలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని, సోమవారం (జూన్ 15న) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనుంది. సభలో తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని వారు స్పీకర్‌ను కోరనున్నారు. తొలుత ప్రచారంలో ఉన్న 19 మంది తిరుగుబాటు ఎంపీల జాబితాలో సుదీప్ బందోపాధ్యాయ పేరు లేదు. అయితే కేంద్ర మంత్రితో ఆయన నేరుగా సమావేశం కావడంతో పార్టీలో చీలిక లోతుగా ఉందనే విషయం స్పష్టమవుతోంది.