కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా తన ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడినట్టు తెలిసింది. అధికారుల కథనం ప్రకారం.. రాష్ట్రంలో స్కూల్ నియామకాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలకు సంబంధించి బుర్వాన్లోని సాహా ఇంట్లో, రఘునాథ్గంజ్లోని అతడి అత్తమామల ఆస్తుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది.
ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే ఇంటి సరిహద్దు గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడని.. అయితే ఈడీ అధికారులు, కేంద్ర బలగాలు దగ్గర్లోని పొలంలో ఆయనను పట్టుకున్నట్టు తెలిసింది. బలమైన ఆధారాలను నాశనం చేసేందుకు ఎమ్మెల్యే తన మొబైల్ ఫోన్ను తన ఇంట్లోని ఒక కొలనులోకి విసిరేసినట్టు పీటీఐ పేర్కొంది. అయితే అతడి రెండు ఫోన్లను రికవరీ చేసి ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. ఇదే స్కామ్లో ఆగస్ట్ 2023లో ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా అరెస్ట్ అయ్యారు. మే 2025లో ఆయనకు బెయిల్ వచ్చింది.