కోల్‌కతా, ఢిల్లీ, ఏప్రిల్ 8: జూన్ 4 తర్వాత అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ చెప్పడానికి అర్థం విపక్ష నేతలందరినీ లోక్‌సభ ఎన్నికల తర్వాత జైల్లో వేయడమేనా అని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. బంకురా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ‘ఒక ప్రధాని ఇలాగేనా మాట్లాడేది? ఎన్నికల తర్వాత బీజేపీ నేతలను జైల్లో వేస్తానని నేనంటే ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యయంలో ఇది ఆమోదయోగ్యం కాదు కాబట్టి నేను అలా అనను’ అని ఆమె అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష నేతలను జైల్లో వేయడమే మోదీ గ్యారంటీ అని ఆమె ఆరోపించారు. ఎన్నికల తర్వాత పార్లమెంట్ భవనం మొత్తాన్ని జైలుగా మార్చినా భయపడేది లేదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం కారణంగా ఇప్పటికే దేశమంతా వర్చువల్ కారాగారంగా మారిందని ఆమె ఆరోపించారు.
ఎన్ఐఏ చీఫ్ నియామకానికి ఈసీ అనుమతి తీసుకున్నారా?
సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ, ఐటీ విభాగల అధిపతులను మార్చాలని సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థలు విపక్ష నేతలను వేధిస్తున్నాయని టీఎంసీ నాయకులు ఎన్నికల కమిషనర్లను కలిసిన అనంతరం ఆరోపించారు. ఇదే విషయమై టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఎక్స్‌లో విమర్శనాస్ర్తాలు సంధించారు.
బీజేపీ నేత జితేంద్ర తివారీ ఎన్ఐఎ ఎస్పీ డీఆర్ సింగ్‌ను మార్చి 26న కలిశారని.. అదే రోజు సదానంద్ ఎన్ఐఎ కొత్త చీఫ్‌గా నియమితులయ్యారని తెలిపారు. తివారీ ఒక ప్యాకెట్‌తో పాటు ఎన్ఐఎ లక్ష్యంగా చేసుకోవాల్సిన టీఎంసీ నేతలు, కార్యకర్తల జాబితాను డీఆర్ సింగ్‌కు అందించారిన సాకేత్ ఆరోపించారు. ‘బీజేపీ పాలిత రాష్ట్రంలోని అధికారిని ఎన్ఐఎ అధిపతిగా ఎన్నికల సమయంలో నియమించారు. దీనికి మోదీ ప్రభుత్వం ఈసీ అనుమతి తీసుకుందా?’ అని ఆయన ప్రశ్నించారు.
విచారణకు సహకరించడం లేదు
2022 భూపతినగర్ పేలుళ్ల కేసులో సోమవారం విచారణకు రావాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎన్) ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు సమన్లు జారీ చేసింది. అయితే సదరు నాయకులు విచారణకు హాజరు కాలేదు. ఇప్పటికే అరెస్టయిన ఇద్దరు టీఎంసీ నాయకులు విచారణకు సహకరించడం లేదని ఎన్ఐఎ అధికారి ఒకరు తెలిపారు.