Shantanu Sen : పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాల నాటి నుంచి మమతాబెనర్జీ (Mamata Banerjee) కి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. తాజాగా సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ శంతను సేన్ (Shantanu Sen) పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. నిన్న కకోలీ ఘోష్ దస్తీదార్ (Kakoli Ghosh Dastidar) పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఆ మరుసటి రోజే తన రాజీనామాతో శంతను సేన్ షాకిచ్చారు.
2024 నాటి ఆర్జీకర్ హత్యాచార కేసు, పార్టీపై వస్తున్న నిరంతర అవినీతి ఆరోపణలతో తాను తీవ్ర మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నానని శంతను సేన్ పేర్కొన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా తన పాత్రను నిర్వర్తించే స్థితిలో తాను లేనని తెలిపారు. వివిధ సమయాల్లో తాను పార్టీ నిర్ణయాలతో ఏకీభవించలేదని, అనేక వివాదాస్పద అంశాలపై తాను బహిరంగంగానే ప్రశ్నించానని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రజలు తనను వివిధ సందర్భాలలో ఎంతగానో ప్రశంసించారని పేర్కొన్నారు. ఆర్జీకర్ కేసు, నిరుద్యోగం, అవినీతి సహా వివిధ అంశాల కారణంగా ప్రజలు తమను ఓడించారని, అందుకే అధికార ప్రతినిధిగా మాట్లాడటానికి తన మనసు అంగీకరించడం లేదని పేర్కొన్నారు.