West Bengal Elections | కోల్కతా, ఏప్రిల్ 28: పశ్చిమ బెంగాల్లో బుధవారం రెండో, ఆఖరి విడత ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఫాల్టా నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సంఘం పరిశీలకునిగా నియమించిన ఐపీఎస్ అధికారి పాల్ శర్మకు వ్యతిరేకంగా 24 పరగణాల జిల్లాలో మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు.
ఫాల్టాలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ నివాసం, ఎన్నికల కార్యాలయం బయట పోలీస్ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జహంగీర్ ఖాన్ అనుచరులు కొందరు ప్రజల నుంచి ఓటర్ ఐడెంటిటీ కార్డులు సేకరిస్తున్నారని వచ్చిన ఆరోపణల మేరకు విధి నిర్వహణలో సింగంగా పేరున్న శర్మ అంతకుముందు అక్కడ పర్యటించి, ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చర్యనైనా అడ్డుకుంటామని జహంగీర్ ఖాన్ను ఉద్దేశించి హెచ్చరించారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన జహంగీర్ ఖాన్ ‘ఇది బెంగాల్. అతడు సింగం అయితే, నేను పుష్ప. బీజేపీ నియమించిన పోలీస్ అధికారి బెదిరింపులు, బలప్రయోగం ఇక్కడ చెల్లదు.’ అని పేర్కొన్నారు. శర్మ, అతని బలగాలు తనను, తన మద్దతుదారులపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘నిన్నటి నుంచి నన్ను,నా రక్షణ సిబ్బందిని పార్టీ ఆఫీస్లో బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత మా కుటుంబ సభ్యులను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. ఒక పోలీస్ పరిశీలకుడు చేయాల్సిన పనేనా ఇది?’ అని ప్రశ్నించారు. శర్మ వైఖరిని పలువురు మంత్రులు సైతం ఖండించారు. కాగా, తన ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించిన సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ కుటుంబంపై దాడి చేయడమే కాక, బీజేపీకి ఓటు వేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారని ఒక మహిళ ఫాల్టా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.