Tirupati laddoos | తిరుమలలో లడ్డూ (Tirupati Laddoos) వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో తయారయ్యే ఈ పవిత్ర లడ్డూలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ అంశంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్ర ప్రసాదమైన ఈ లడ్డూను.. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ( Ram temple event) భక్తులకు పంపిణీ చేసినట్లు ఆలయ ప్రధాన పూజారి (Chief Priest of Ram Janmabhoomi) ఆచార్య సత్యేంద్ర దాస్ తాజాగా తెలిపారు.
అయితే, ఎన్ని లడ్డూలు వచ్చాయన్నదానిపై తనకు స్పష్టంగా తెలియదని.. 300 కేజీల వరకూ లడ్డూ ప్రసాదంగా వచ్చినట్లు అంచనా వేశారు. ఆ విషయం ఆలయ ట్రస్ట్‌కు స్పష్టంగా తెలుసని చెప్పారు. అక్కడి నుంచి వచ్చిన లడ్డూలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. పవిత్ర ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపడం అన్నది క్షమించరాని నేరం అని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘వైష్ణవులు, కొందరు భక్తులు కనీసం వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా ముట్టరు. అలాంటి పరిస్థితుల్లో నెయ్యిలో కొవ్వు కలిపారనడం నిజంగా దురదృష్టకరం. ఇది హిందువుల విశ్వాసాలను ఎగతాళి చేయడమే’ అని అన్నారు.
కాగా, ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం లక్ష లడ్డూ ప్రసాదాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా తయారు చేసి పంపింది. అయోధ్య ఆలయ కమిటీ సభ్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు.
శ్రీవారి లడ్డూ కల్తీ పై నివేదికివ్వండి
కాగా, తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కారును కేంద్ర మంత్రి నడ్డా కోరారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడానని, వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపాలని కోరానన్నారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు అవసరమని, దోషులకు తగిన శిక్ష పడాల్సిందేనని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇది కేవలం కుంభకోణమే కాదని, హిందూయిజం నాశనానికి జరిపిన కుట్రగా ఆయన అభివర్ణించారు.
సుప్రీంకోర్టులో పిటిషన్
తిరుమల కల్తీ నెయ్యి వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. తిరుమల లడ్డూ కల్తీతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుని హిందువుల మతపరమైన హక్కులను కాపాడాలని సత్యం సింగ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
Also Read..
Bengal doctors | ఎట్టకేలకు 42 రోజుల తర్వాత.. పాక్షికంగా విధుల్లోకి చేరిన కోల్‌కతా వైద్యులు
Sri Lanka | ప్రశాంతంగా కొనసాగుతున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. త్రిముఖ పోరులో గెలుపెవరిదో..?
Manipur | మయన్మార్ నుంచి 900 మంది మిలిటెంట్ల చొరబాటు.. మణిపూర్‌లో హై అలర్ట్