లక్నో: వంతెన కోసం పాలకులు, అధికారులు ఇచ్చిన హామీలతో గ్రామస్తులు విసిగిపోయారు. ఏళ్లుగా నిర్మాణం జరుగకపోవడంతో సొంతంగా నిర్మించుకుంటున్నారు. దీని కోసం కోటి మేర నిధులు సేకరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాయంపూర్, సోనా గ్రామాల పరిధిలోని మాంగై నదిని దాటేందుకు గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నదిపై వంతెన నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు సొంతంగా బ్రిడ్జి నిర్మించేందుకు రంగంలోకి దిగారు. దీని కోసం సుమారు కోటి నిధులు సేకరించారు.
కాగా, ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో పనిచేసి పదవీ విరమణ చేసిన రవీంద్ర యాదవ్ ఈ వంతెన నిర్మాణం కోసం చొరవ చూపారు. దీని కోసం రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ఆయన బ్రిడ్జి నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ సమక్షంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దీంతో విరాళాలు ఇచ్చేందుకు మరింత మంది ముందుకు వచ్చారు.
మరోవైపు వంతెన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 108 అడుగుల ఎత్తులో నదిపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే 50 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. జిల్లా కేంద్రమైన ఘాజీపూర్‌కు దూరం 25 కిలోమీటర్లు తగ్గుతుందని చెప్పారు. విద్య, వైద్యం కోసం నది దాటేందుకు పడవలపై ఆధారపడాల్సిన అవసరం, వరదల వల్ల ఇబ్బందులు ఉండవని అన్నారు.
కాగా, గ్రామస్తులు నిధులు సేకరించి సొంతంగా వంతెన నిర్మిస్తున్న విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. పాలకవర్గం అనుమతి లేకుండా నిర్మిస్తున్న నేపథ్యంలో ఎదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించారు. మీడియా ద్వారా ఈ వంతెన నిర్మాణం గురించి తెలిసిందన్నారు.
భారీ వాహనాల రాకపోకలు సాగేలా దీనిని నిర్మిస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే ప్రజల భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. దీంతో ఈ వంతెన వల్ల ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఉండేందుకు నిర్మాణ నాణ్యతను నిర్ధారించడానికి తనిఖీ చేస్తామని మీడియాకు వెల్లడించారు.
From neglect to action: How Ghazipur villagers took matters into their own hands & built a bridge!
Watch: https://t.co/QukdU0E3T6 | #BusinessToday #Ghazipur #SelfReliantIndia #RuralDevelopment #BridgeConstruction pic.twitter.com/4o175Slbot
— Business Today (@business_today) March 27, 2025