న్యూఢిల్లీ : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో కొందరు ప్రజాప్రతినిధుల తీరు ప్రజల్ని సొంత డబ్బులతో వంతెన నిర్మించుకొనేందుకు పురిగొల్పింది. తమకు ఇచ్చిన హామీ మేరకు తమ గ్రామానికి వంతెన నిర్మిస్తారని చాలా ఏండ్లు ఎదురుచూసి..చివరకు విరాళాలతో సొంతంగా వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఘటన ఘాజీపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. వారి గ్రామంలో వంతెన నిర్మిస్తామని స్థానిక నాయకులు..గత ఏడాది శంకుస్థాపన కూడా జరిపించేశారు. అటు తర్వాత నిర్మాణ పనులు ముందుకు కదల్లేదు. ఎన్నిమార్లు విషయాన్ని అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. నాయకుల తీరుతో విసిగిపోయిన ప్రజలు, తామే సొంతంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం విరాళాల ద్వారా దాదాపు కోటి రూపాయల వరకు సమకూర్చుకున్నారు. ఈ మొత్తంతో మాగై నదిపై 108 అడుగుల ఎత్తులో వంతెన నిర్మాణం సగం పూర్తయ్యింది.