బెంగళూరు : బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు అక్కడి స్థానికులకు కొత్తేమీ కాదు. ఈ క్రమంలో ట్రాఫిక్‌తో బేజారెత్తిన ఈజ్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టీ.. సమస్య పరిష్కారానికి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టడానికి తాను సిద్ధమంటూ ప్రకటించారు. గత శనివారం రాత్రి ఔటర్ రింగ్ రోడ్డులో 11 కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు తనకు 2 గంటలకు పైగా పట్టిందని, అక్కడ ట్రాఫిక్ లైట్లు కాని ట్రాఫిక్ పోలీసులు కాని ఎందుకు లేరో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గూగుల్ ప్రతిపాదన అమలుకు రూ.కోటి ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ట్రాఫిక్ డాటాను అందచేసేందుకు మేనేజ్మెంట్ ఇన్సైట్ పేరిట ఓ టూల్‌ని అందచేసేందుకు గూగుల్ ప్రతిపాదించింది. ఉపగ్రహ చిత్రాలతో కలిసి ఈ డాటాను ఉపయోగించుకుని ఏయే సమయాలలో ముఖ్యమైన కూడలులు ట్రాఫిక్ జామ్ని ఎదుర్కొంటున్నాయో మ్యాపింగ్ చేయాలని పిట్టీ సూచించారు.