న్యూఢిల్లీ : భారతీయ, చైనా సైనిక బలగాల మధ్య గల్వాన్ ఘర్షణ తర్వాత భద్రతా కారణాలు చూపుతూ భారత ప్రభుత్వం 2020లో నిషేధించిన చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ యాప్ టిక్ టాక్ ఐదేళ్ల తర్వాత మళ్లీ భారత్‌లోకి ప్రవేశించే అవకాశం కనపడుతోంది. టిక్ టాక్‌తోపాటు వందలాది చైనీస్ గేమింగ్ యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత కూడా భారత్‌లో ఏదోవిధంగా కొనసాగేందుకు శాయశక్తులా ప్రయత్నించిన టిక్ టాక్ కంపెనీ ఎట్టకేలకు 2023 ఫిబ్రవరి 28న మూతపడింది. అప్పటి నుంచి భారత్‌లో అందుబాటులో లేని టిక్ టాక్ వెబ్సైట్ హఠాత్తుగా మళ్ల్లీ జీవం పోసుకుంది. త్వరలోనే దేశంలో షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ని కంపెనీ తిరిగి ప్రారంభించనున్నట్లు సూచనలు అందుతున్నాయి. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అలీఎక్స్‌ప్రెస్, విమెన్ క్లోతింగ్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ షీన్ కూడా రీఎంట్రీ ఇవ్వన్నుట్టు తెలుస్తున్నది.
ఈ కంపెనీల వెబ్సైట్లు భారత్‌లో తిరిగి ప్రారంభమయ్యాయి. చైనా విదేశాంగ మంత్రి భారత్‌ను సందర్శించి వెళ్లిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. భారతీయ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించినప్పటి నుంచి భారత్, చైనా మధ్య సంబంధాలలో పురోగతి కనిపిస్తోంది. భారత్‌కు ఎరువులు, అరుదైన ఖనిజాలు, సొరంగాలను తవ్వే మిషన్ల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు చైనా గురువారం ప్రకటించింది. టియాంజిన్‌లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే షాంఘై సహకార సంస్థల(ఎస్సీఓ) సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. కాగా, టిక్ టాక్‌ను తిరిగి దేశంలో అనుమతించే విషయమై అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.