న్యూఢిల్లీ: మెక్సికన్ డ్రగ్స్ ఉత్పత్తిదారులతో సంబంధాలు కలిగిన డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టును రట్టు చేసినట్టు మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం తెలిపింది. ఈ నెల 25న యూపీలోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాలోని కస్నా పారిశ్రామిక ప్రాంతంలో ఈ ల్యాబ్‌ను గుర్తించి 95 కిలోల మెథంఫెంటమైన్ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పింది. ఈ ఘటనలో తీహార్ జైలు వార్డెన్, ఇద్దరు ఢిల్లీ వ్యాపారవేత్తలు సహా అయిదుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది.
ఇందులో ఒక వ్యాపారవేత్త గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని, అతడు తీహార్ జైల్ వార్డెన్‌తో సంబంధాలు ఏర్పరుచుకొన్నాడని తెలిపింది. జైలు వార్డెన్ డ్రగ్స్ ఉత్పత్తికి అవసరమైన రసాయనాలు కొనుగోలు చేయడంలో అతడికి సహకరించాడని వెల్లడించింది. దేశ రాజధాని ప్రాంతంలో ఈ డ్రగ్స్ ముఠా విస్తరించి ఉందని ఎన్సీబీ తెలిపింది. ముంబైకి చెందిన కెమిస్ట్ సాయంతో ఈ ముఠా డ్రగ్స్‌ను తయారు చేసి, మెక్సికన్ డ్రగ్స్ ఉత్పత్తిదారుల ముఠా సభ్యుడితో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నదని చెప్పింది.