దేశంలో కరోనా మహమ్మారి చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశరాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. వీటి నియంత్రణ కోసం ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలు చేశారు.
ఇప్పుడు తాజాగా ఢిల్లోని జైల్లో 66 మంది ఖైదీలు, 48 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిసింది. తిహార్ జైల్లో 42 మంది ఖైదీలు, 34 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది. అదే సమయంలో మండోలి జైల్లో 24 మంది ఖైదీలు, 8 మంది జైలు సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడి రోహిణి జైల్లో కూడా ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
కాగా, దేశవ్యాప్తంగా తాజాగా 1.68 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. అలాగే కొత్తగా 277 మంది కరోనా మహమ్మారికి బలైనట్లు అధికారులు వెల్లడించారు.