కలేసర్: కలేసర్ నేషనల్ పార్క్ (Kalesar National Park)..! ఈ పార్క్ అనేక రకాల వన్య ప్రాణులకు ఆవాసం..! హర్యానా రాష్ట్రం యమునా నగర్ జిల్లాలోని కలేసర్ ఏరియాలో ఈ నేషనల్ పార్క్ ఉన్నది..! ఈ పార్కులో ఏనుగులు, చిరుత పులులు, జింకలు, ఎలుగుబంట్లు, సాంబార్లు, కోతులు, రకరకాల పక్షులు ఉన్నాయి. అయితే, గత 110 ఏళ్లుగా ఆ పార్కులో పెద్దపులులు మాత్రం ఉండేవి కావు. కానీ తాజాగా ఓ పెద్దపులి (Big Cat) ప్రత్యక్షమైంది.
పార్కులో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లో పెద్దపులి చిక్కింది. ఆ కెమెరాల్లో ఏప్రిల్ 18, 19 తేదీల్లో పెద్దపులికి సంబంధించిన ఫొటోలు పడ్డాయి. దాంతో ఆ పెద్దపులి వయసెంతో తెలుసుకునేందుకు దాని అడుగుజాడలను సేకరించాలని హర్యానా అటవీ శాఖ నిర్ణయించింది. అందుకోసం అటవీశాఖ మంత్రి కన్వర్ పాల్ ప్రత్యేకంగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు.
కాగా, ఇటీవల కలేసర్లో ప్రత్యక్షమైన పెద్దపులి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ పరిధిలోగల రాజాజీ నేషనల్ పార్కు నుంచి వచ్చి ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. కలేసర్ నేషనల్ పార్క్ హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలోగల సింబల్బారా నేషనల్ పార్క్ పక్కనే ఉంటుంది. ఈ రెండు పార్కులు రాజాజీ నేషనల్ పార్కుతో అనుసంధానమై ఉంటాయి.