బెంగళూరు: ఓలా, ఉబర్‌కు పోటీగా ప్రారంభించిన యాప్ ద్వారా ఆటో డ్రైవర్లు ఏడాదిలోపు సుమారు రూ.189 కోట్లు సంపాదించారు. అలాగే జీరో కమీషన్ విధానం ద్వారా సుమారు రూ. 19 కోట్లు ఆదా చేసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది నవంబర్‌లో ఓలా, ఉబర్‌కు పోటీగా ‘నమ్మ యాత్రి యాప్’ ను (Namma Yatri app) ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) సంస్థ ప్రారంభించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆటో డ్రైవర్లు, కస్టమర్లను నేరుగా ఈ యాప్ అనుసంధానం చేస్తుంది.
కాగా, ప్రారంభించిన ఏడాదిలోపే తమ యాప్ ద్వారా ఆటో డ్రైవర్లు సమిష్టిగా రూ. 189 కోట్లు సంపాదించారని ఓఎన్డీసీకి చెందిన టీనా గుర్నానీ తెలిపారు. అలాగే జీరో కమీషన్ మోడల్ ద్వారా ఆటో డ్రైవర్లకు సుమారు రూ.19 కోట్లు ఆదా చేయడంలో ఈ యాప్ సహాయపడిందని పేర్కొన్నారు.
మరోవైపు ‘నమ్మ యాత్రి యాప్’ ఛార్జీలు ప్రభుత్వం నిర్ణయించిన రేటుపై ఆధారపడి ఉంటాయి. ప్రతి ట్రిప్‌కు రెండు కిలోమీటర్ల దూరం వరకు కనీస ఛార్జీ రూ.30. ఎక్కువ దూరానికి కిలోమీటరుకు రూ.15 చొప్పున ఛార్జీ ఉంటుంది. అలాగే కనీస బుకింగ్ ఛార్జీ రూ. 10 కాగా, ఆటో డ్రైవర్లు రూ.30 వరకు పెంచుకునే అవకాశం కూడా ఉన్నది.