Russia Ukraine War | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో జరుగుతున్న అత్యంత భీకర యుద్ధంగా మారిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై సోమవారం నాటికి మూడేళ్లు పూర్తయ్యింది. ఈ యుద్ధం ఆ రెండు దేశాలనే కాక మిగిలిన ప్రపంచంపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముగింపు ఎన్నడో తెలియని అనిశ్చిత వాతావరణంలో ఉభయ దేశాల నాయకులు తమ సైనికుల వీరత్వాన్ని ఈ సందర్భంంగా కీర్తించారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో)లో చేరాలన్న ఉక్రెయిన్ ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యా.. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ను ఆక్రమించుకునేందుకు ప్రత్యేక సైనిక చర్యకు దిగడంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది.
భారీగా ఆస్తి, ప్రాణనష్టం
సులభంగా ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవచ్చనుకున్న రష్యాకు కీవ్ సేనల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది. పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందుతున్న కోట్లాది డాలర్ల సాయం కారణంగా పుతిన్‌కు విజయం అంత తొందరగా దక్కడం సాధ్యం కాలేదు. ఉక్రెయిన్‌లోని ఐదింట ఒక వంతు భూభాగాన్ని రష్యా సేనలు ఆక్రమించుకోగా యుద్ధ భూమిలో రెండు వైపులా లక్షా 50 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఈ యుద్ధం ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. రష్యా దాడుల్లో అనేక భవనాలు, ఆనకట్టలు, రహదారులు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ ద్రవ్యోల్బణం 12 శాతానికి, రష్యాలో 9.5 శాతానికి పెరిగింది. యుద్ధంలో రష్యా కూడా తీవ్రంగా నష్టపోయింది. పశ్చిమ దేశాల ఆంక్షలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది.
అమెరికా వైఖరిలో మార్పు..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం యుద్ధం పట్ల అమెరికా వైఖరిలో వచ్చిన మార్పు ఉక్రెయిన్తోపాటు ఇతర యూరోపియన్ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. గత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక, మానవతా సహాయంగా 119 బిలియన్ డాలర్లకు పైగా సహాయాన్ని అందచేసింది. అయితే బైడెన్ మాదిరి ట్రంప్ నుంచి సహకారం ఉక్రెయిన్‌కు లభించే అవకాశం కనపడడం లేదు.
సంపూర్ణ యుద్ధ ఖైదీల మార్పిడికి ప్రతిపాదన
యుద్ధాన్ని ముగించే ప్రక్రియ ప్రారంభానికి ముందుగానే రష్యాతో యుద్ధ ఖైదీల సంపూర్ణ మార్పిడి పూర్తి కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం ప్రతిపాదించారు. కీవ్‌లో జెలెన్స్కీ ప్రసంగిస్తూ, యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేయడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. సంపూర్ణంగా యుద్ధ ఖైదీల విడుదల జరగాలని, రెండు దేశాలకూ వర్తించాలని ఆయన ప్రతిపాదించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంకెల్లోn 152,295 మంది- యుద్ధంలో మరణించిన రష్యన్లు, ఉక్రెయినియన్లు (సైనికులు, సాధారణ పౌరులు సహా)