Road accident : ఉత్తరప్రదేశ్లోని బహ్రెయిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నేపాలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బహ్రెయిక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
తులసిపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బ్రిజ్ నందన్ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్లోని డాంగ్ జిల్లాకు చెందిన 10 మంది కారులో ఉత్తరప్రదేశ్లోని వారణాసికి వస్తున్నారు. ఈ క్రమంలో వారి వాహనం బహ్రెయిక్ జిల్లాలోని నగాయ్ బసైది గ్రామ సమీపానికి చేరుకోగానే వేగంగా వస్తున్న కారుకు ఓ సైకిలిస్టు అడ్డువచ్చాడు. దాంతో సైకిలిస్టును తప్పించే క్రమంలో కారు బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ప్రవీర్ ఖాత్రి (70) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువరాజ్ (38), ధంబాలి (80) మరణించారు. మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.