Cough Syrup Case | మధ్యప్రదేశ్‌లో దగ్గు సిరప్ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో మరో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లో కాఫ్ సిరప్ మరణాలు 20కి చేరాయి. చింద్వారాలో 17 మంది, పంధుర్నాలో ఒకరు, బేతుల్‌లో ఇద్దరు చనిపోయారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఐదుగురు పిల్లలు ఇప్పటికీ ప్రాణాప్రాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ కేసులో దగ్గుమందు సిరప్ కంపెనీ యజమానిని అరెస్టు చేయనున్నారు. ఆయనను పట్టుకునేందుకు రెండు బృందాలు చెన్నై, కాంచిపురం చేరుకున్నాయి. దురదృష్టకర ఘటనలో 20 మంది పిల్లల ప్రాణాలు కోల్పోయారని మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి రాజేంద్ర శుక్లా పేర్కొన్నారు.
నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఉన్న పిల్లలకు దగ్గు సిరప్ ఇవ్వకుండా భారత ప్రభుత్వం, ఐసీఎంఆర్సీ అడ్వైజరీని పాటించాలని శుక్లా కోరారు. శుక్లా నిన్న నాగ్‌పూర్‌ను సందర్శించారు. ఐదుగురు పిల్లలు ఆసుపత్రిలో ఉన్నారని.. వారి కుటుంబాలను కలుసుకున్నట్లు చెప్పారు. పిల్లలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ ప్రవీణ్ సోనితో సహా కొంతమంది ప్రైవేట్ వైద్యులు పిల్లలకు కోల్డ్రిఫ్ సిరప్ సిఫారసు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సిరప్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే పిల్లల్లో కిడ్నీలు దెబ్బతినడం ప్రారంభించాయి. వారి పరిస్థితి క్షీణించి చనిపోయారు.
సిరప్‌లో విషపూరిత రసాయనాలు ఉన్నాయని, అవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కిడ్నీలను దెబ్బతీస్తున్నాయని వైద్య పరీక్షల్లో తేలింది. అందుకే చాలా మంది పిల్లలు కిడ్నీ వైఫల్యంతో మరణించారని.. మరణాల సంఖ్య పెరగడంతో చింద్వారా జిల్లా యంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది. అదనపు కలెక్టర్ ధీరేంద్ర సింగ్ ఇప్పటివరకు 16 మంది చనిపోయారన్నారు. తీవ్రమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని, దీన్ని నివారించేందుకు అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఐదు మెడికల్ స్టోర్లను మూసివేసి, అనుమానిత సిరప్ నమూనాలను ల్యాబ్ పరీక్ష కోసం అధికారులు పంపారు. పిల్లలకు ఎలాంటి దగ్గు సిరప్ ఇవ్వకుండా చూడాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించింది. ఇంతలో దర్యాప్తు పూర్తి పారదర్శకతతో జరుగుతోందని, దోషులను వదిలిపెట్టబోమని బీజేపీ పేర్కొంది.