కొత్తగూడెం ప్రగతి మైదాన్ : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఎస్పీ కిరణ్చవాన్ కథనం ప్రకారం.. సుక్మా జిల్లా బెజ్జి – చింతగుఫా మధ్య గల తుమాల్పాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం డీఆర్జీ భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు.
వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఒక 303 రైఫిల్, బ్యారెల్ గ్రైనేడ్ లాంచర్లు, ఇతర ఆయుధ, వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీన పర్చుకున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులతోపాటు జన్మిలీషియా కమాండర్, స్నైపర్ స్పెషలిస్ట్ మడివి దేవా ఉన్నట్లు ఆయన ధ్రువీకరించారు.