న్యూఢిల్లీ: క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారిపై .. ద లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ఏషియా జర్నల్ ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది. క్యాన్సర్ నిర్ధారణ(Cancer Diagnosis) జరిగిన తర్వాత భారత్లో ఆ వ్యాధి వల్ల ప్రతి అయిదుగురిలో ముగ్గురు పేషెంట్లు చనిపోతున్నట్లు ఆ జర్నల్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంట్లో మహిళల సంఖ్యే అధికంగా ఉన్నట్లు తేలింది. అమెరికాలో క్యాన్సర్ వల్ల నలుగురిలో ఒకరు మరణిస్తున్నారని, చైనాలో ఇద్దరిలో ఒకరు చనిపోతున్నారని రిపోర్టులో వెల్లడైంది. క్యాన్సర్ కేసుల్లో ఇండియా మూడవ స్థానంలో ఉన్నట్లు ఐసీఎంఆర్ స్టడీలో తేలింది. చైనా, అమెరికా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదు అవుతున్న క్యాన్సర్ మృతుల్లో ఇండియాలో 10 శాతం కేసులు ఉన్నట్లు పేర్కొన్నది. చైనా తర్వాత భారత్ మరణాల్లో రెండో స్థానంలో ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు.
రాబోయే రెండు దశాబ్ధాల్లో క్యాన్సర్ వల్ల ఇండియాలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు డేటా విశ్లేషణ ద్వారా తెలిసింది. వృద్ధ జనాభా వల్ల.. ఆ మృతుల సంఖ్య ప్రతి ఏడాది రెండు శాతం పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. గడిచిన 20 ఏళ్లుగా నిర్వహించిన స్టడీలో.. 36 రకాల క్యాన్సర్ బాధితులను పరీక్షించారు. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ 2022, గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ డేటాబేస్ల ఆధారంగా క్యాన్సర్ మృతులపై రిపోర్టును రిలీజ్ చేశారు. క్యాన్సర్ అని తేలిన తర్వాత.. ఇండియాలో ప్రతి అయిదుగురు పేషెంట్లలో ముగ్గురు చనిపోతున్నట్లు పరిశోధకులు తెలిపారు. అయిదు రకాల క్యాన్సర్లకు ఎక్కుమ మంది బలి అవుతున్నారని, ఆ మృతుల సంఖ్య ఇండియాలో 44 శాతం ఉన్నట్లు రిపోర్టులో చెప్పారు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతున్న మహిళల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
రొమ్ము క్యాన్సర్ కేసులు ఆడ, మగ కలిపి 13.8 శాతం, సర్వైకల్ క్యాన్సర్ కేసులు 9.2 శాతంగా నమోదు అవుతున్నాయి. ఇక మహిళల్లో కొత్తగా నమోదు అవుతున్న వాటిల్లో 30 శాతం కేసులు బ్రెస్ట్ క్యాన్సర్వే ఉన్నాయి. ఆ కేసుల్లో 24 శాతం మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కొత్తగా సర్వైకల్ కేసులు 19 శాతం నమోదు కాగా, వాటిల్లో 20 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. పురుషుల్లో ఎక్కువ శాతం నోటి క్యాన్సర్ వస్తోంది. ప్రతి ఏడాది కొత్తగా 16 శాతం కేసులు నమోదు అవుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ 8.6 శాతం, అన్నవాహిక క్యాన్సర్ 6.7 శాతం కేసులు నమోదు అవుతున్నాయి.