ముంబై: మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన మరాఠీ నటి కేత్కి చితాలేపై మూడు కేసులు నమోదయ్యాయి. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మరాఠీ నటి కేత్కి చితాలే, ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో శరద్ పవార్‌కు వ్యతిరేకంగా పలు విమర్శలు చేశారు. ‘నరకం ఎదురు చూస్తున్నది, బ్రాహ్మణ ద్వేషి’ అంటూ పలు అభ్యంతరకర పోస్టులు చేసింది. కాగా, ఆ నటి మరాఠీలో చేసిన ఈ పోస్టుల్లో శరద్ పవార్ పూర్తి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే పవార్, 80 ఏళ్ల వ్యక్తి అని పరోక్షంగా ఆరోపించింది. దీంతో స్వప్నిల్ నెట్కే ఫిర్యాదుతో థానేలోని కాల్వా పోలీస్ స్టేషన్‌తోపాటు మరో రెండు పోలీస్ స్టేషన్లలో నటి కేత్కి చితాలేకు వ్యతిరేకంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
కాగా, శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన మరాఠీ నటి కేత్కి చితాలేపై ఎన్సీపీ నేతలు, ఆ పార్టీ మంత్రులు మండిపడ్డారు. ఎన్సీపీ యువ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా సుమారు 200 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తారని మంత్రి జితేంద్ర అవద్ తెలిపారు. ఆ నటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మరో ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజబల్ డిమాండ్ చేశారు. శరద్ పవార్‌పై అవమానకర ప్రకటనలు చేయడం ద్వారా చౌకగా, ఉచితంగా ప్రచారం పొందడానికి ఉత్తమ మార్గమని మహారాష్ట్ర బీజేపీ నాయకుల నుంచి ఈ నటి తెలుసుకున్నదంటూ ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ఎద్దేవా చేశారు.