లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మూడు రోజుల చిన్నారి చీమలు కరవడంతో మృతి చెందింది. యూపీలోని మహోబా జిల్లా ముధారికి చెందిన సీమా, సురేంద్ర రైక్వార్ భార్యాభర్తలు. నిండు చూలాలైన సీమా.. డెలివరీ కోసం మహోబా జిల్లా కేంద్ర దవాఖానలో చేరింది. మే 30న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు నియోనటల్ ఇన్టెన్సివ్ కేర్ యూనిట్లో (NICU)లో ఉంచారు. అయితే ఆ నవజాత శిశువు.. చీమలు కరవడంతో జూన్ 2న కన్నుమూసింది.
దీంతో కోపోద్రిక్తులైన చిన్నారి బంధువులు.. హాస్పిటల్ ముందు నిరసనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి మృతువాత పడిందని ఆరోపించారు. దీంతో ఈ ఘటనపై దవాఖాన సూపరింటెండెంట్ దర్యాప్తునకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, చిన్నారికి చికిత్స అందించడానికి వైద్యులు తమ వద్ద రూ.6500 లంచం తీసుకున్నారని బాధితులు తెలిపారు.