West Bengal CM | కోల్‌కతా, మే 5:పశ్చిమ బెంగాల్లో మొదటిసారి పాగా వేసిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై అటు పార్టీలోను, ఇటు రాష్ట్రంలోను ఉత్కంఠ నెలకొంది.
గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, తాజా ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో ఓడించిన సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 293 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, బీజేపీ 206 సీట్లు గెలుపొందింది. అయితే సీఎం పదవి కోసం సువేందుతోపాటు మరో ఇద్దరు కూడా పోటీలో ఉన్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శామిక్ భట్టాచార్య, ఉపాధ్యక్షుడు అగ్నిమిత్ర పాల్ కూడా సీఎం రేసులో ఉన్నట్టు తెలిపాయి. మమతాబెనర్జీని ఓడించినందుకు సువేందును సీఎం పదవి వరించవచ్చని అభిప్రాయపడ్డాయి. మమతను ఆయన రెండుసార్లు 2021 (నందిగ్రామ్), 2026 (భవానీపూర్)లో ఓడించారు.
ఇదిలా ఉండగా, బెంగాల్లో తాము కూడా మహిళా సీఎంను నియమించాలని బీజేపీ భావిస్తే అగ్నిమిత్ర పాల్‌కు ఆ అవకాశం దక్కవచ్చని తెలుస్తున్నది.