హసన్, ఆగస్టు 9: కర్ణాటకలోని హసన్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ అఘాయిత్యాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసి బాధిత యువతి సోదరుడికి ఆ వీడియోను పంపారు. హసన్ జిల్లాలోని పెన్షన్ మొహల్లా పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల ఈ దారుణం జరిగింది. నిందితులు అబ్దుల్ అఫ్తాబ్, రజిక్ పాషా, ఉమ్రాన్‌ని పోలీసులు అరెస్టు చేశారు. తన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓ వీడియోలో తన సోదరిపై సామూహిక అత్యాచారం జరిగిన దృశ్యాలను చూసిన బాధితురాలి సోదరుడు వెంటనే పెన్షన్ మొహల్లా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు అత్యాచారానికి పాల్పడడమేగాక ఆమె కుటుంబాన్ని వేధించేందుకు లేదా అవమానించేందుకు దీన్ని వీడియో తీసి పంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాము పంపిన వీడియోను తమ ఫోన్ నుంచి నిందితులు తొలగించినప్పటికీ సాక్ష్యంగా ఉపయోగించేందుకు బాధితురాలి సోదరుడు ఆ వీడియోను తన మిత్రుడికి ఫార్వర్డ్ చేశాడని పోలీసులు చెప్పారు. ముగ్గురు నిందితులను గాలించి పట్టుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు వీడియోను కూడా ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.