న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 : జతను వెతుక్కుంటూ 3 అడవి కుక్కలు అద్భుతమైన ప్రయాణాన్ని సాగించాయి. ప్రాణాంతకమైన అడ్డంకులు తప్పించుకుంటూ 4,000 కిలోమీటర్లు ప్రయాణించాయి. మానవుల ఉనికి ఉన్నప్పటికీ ఈ వన్యప్రాణులు ఆఫ్రికా దేశం జాంబియా అంతటా రికార్డు స్థాయిలో 4వేల కిలోమీటర్లు ప్రయాణించటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నది. ఓ ఆఫ్రికన్ జంతు వు జతను వెతుక్కునేందుకు ఇంతదూరం ప్రయాణించడం ఇదే మొదటిసారిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వీరి పరిశోధనపై ‘ఎకాలజీ’ జర్నల్లో ప్రచురితమైన వార్తా కథనం ప్రకారం, జతను వెదుక్కునేందుకు బయల్దేరిన అడవి కుక్కల గుంపులో కొన్ని..వలలు, ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు వదిలాయి. మరో మూడు ఆడ కుక్కలు కూడా దాదాపు 4వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగాయని పరిశోధకులు తెలిపారు. ఆఫ్రికన్ అడవి కుక్కలు గుంపులుగా వేటాడుతాయి, ప్రయాణిస్తాయి. సంతానోత్పత్తి కోసం కొత్త భూభాగాలను కనుగొనడానికి చాలా దూరం వెళ్తాయి. కుక్కలకు జీపీఎస్ కాలర్లను అమర్చిన పరిశోధకులు, ఆ జంతువులు ఎక్కువగా మనుషులు తిరుగాడే మార్గాన్ని ఎంచుకున్నాయట. జాంబియా రాజధాని లూసాకా, బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక ప్రాంతాల గూండా అవి ప్రయాణించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.